మీర్పేట్ వికాస్ హైస్కూల్లో అంబరాన్నంటిన సంబరాలు
పిల్లల ఆటపాటలతో ఉల్లాసంగా మారిన వికాస్ హైస్కూల్ ప్రాంగణం
రంగారెడ్డి: ఫిబ్రవరి 13(భారత్ కి బాత్)
మీర్పేట్ మున్సిపాలిటీలోని నంది హిల్స్ లో ఆదివారం నాడు వికాస్ హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీర్పేట్ డిప్యూటీ మేయర్ విక్రం రెడ్డి, ఇంటర్నేషనల్ క్రీడాకారిణి మరియు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కె. మృదుల, మీర్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె. మృదుల మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటల్లో ముందుండాలని, చదువులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టంతో మాత్రమే కాదు, ఇష్టంతో కూడా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ శ్రీకాంత్, మేనేజ్మెంట్ భాను ప్రకాష్ మరియు జంగయ్య లు కలిసి స్కూల్ అభివృద్ధికి దోహదపడుతున్నారని కొనియాడారు. అలాగే విద్యార్థిని, విద్యార్థులు ఆట పాటలతో తమ ప్రతిభను కనబరిచినారని కితాబునిచ్చారు. స్కూల్ యాజమాన్య సభ్యులు కలిసి కె. మృదుల మరియు సిఐ కాశీ విశ్వనాథ్ లని శాలువాతో సన్మానించారు. స్కూల్ ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రెండవ వార్షికోత్సవాలు ఇంత ఘనంగా, సవ్యంగా జరగడానికి కారణమైన పిల్లల తల్లిదండ్రులకు, టీచర్స్ కు, మేనేజ్మెంట్ కు, పోలీసువారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్స్, స్టాఫ్, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.