సమాజంలో అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లు యథాతథం
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
విలువలు గల విద్యను అందించటంలో విద్యాభారతి విజ్ఞానకేంద్రం ముందువరసలో ఉంది
దేశానికి నరేంద్రమోడీ మార్గదర్శకo అత్యవసరం
స్వయంసేవక్ లు చివరి శ్వాస దాకా సమాజం కోసo మాత్రమే పనిచేస్తారు: మోహన్ జీ
రంగారెడ్డి: ఏప్రిల్ 29(భారత్ కి బాత్)
రిజర్వేషన్ల విషయంలో సంఘ్ పేరుతో జరుగుతున్న దుష్ప్రచారానికి ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్ తెరదించారు. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చారని, అసమానతలు తొలగిపోయేదాకా రిజర్వేషన్లు యథాతథంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లకు సంఘ్ వ్యతిరేకం అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరగుతున్నాయని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని, మొదటి నుంచీ రిజర్వేషన్లకు సంఘ్ అనుకూలంగా ఉందని ఆయన విశ్లేషించారు.
విలువలు గల విద్యను అందించటంలో దేశ వ్యాప్తంగా పేరెన్నికగన్న విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన్ కు అనుబంధంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సరస్వతీ విద్యాపీఠం నిలుస్తోందని తెలిపారు. గడచిన 50 సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల్లోనూ 400కు పైగా శిశుమందిర్ లను నిర్వహిస్తూ విద్యాసేవలు అందిస్తోందని, ఈ క్రమంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాలయాలు ఏర్పరుస్తున్న క్రమంలో రెండో సీబీఎస్ఈ పాఠశాలగా నాదర్ గుల్ లోని విద్యాభారతి విజ్ఞానకేంద్రం రూపుదిద్దుకొన్నదని అన్నారు. అనుభవజ్నులైన అధ్యాపకులు, నాణ్యమైన విద్యా వసతులతో, ఆధునిక హంగులతో రూపొందించిన ఈ పాఠశాలకు ముఖ్య అతిథిగా పరమహంస పరివ్రాజకారాచర్య త్రిదండి చిన శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి విచ్చేశారు. చిన జీయర్ స్వామితో కలిసి డాక్టర్ మోహన్ జీ భగవత్ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చిన జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. భారత్ ను విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కేవలం ఒక భారతీయుడుగా తన వాదనలు వినిపిస్తున్నానని చిన జీయర్ స్వామి స్పష్టం చేశారు. విద్య అన్నది పొట్ట కూటి కోసం కానే కాదని, సమాజంలో సక్రమమైన పౌరుడిగా తయారు చేసుకొనేందుకే అని వివరించారు. అటువంటి విలువలతో కూడిన విద్యను శిశుమందిర్ లు అందిస్తున్నాయని అన్నారు.
ముఖ్య ప్రసంగం చేసిన మోహన్ జీ భగవత్ విద్యా వ్యవస్థ మీద కీలక సూచనలు చేశారు. విద్య అన్నది ప్రపంచాన్ని తెలుసుకొనే మార్గం అని తేల్చి చెప్పారు. ఈ చదువుల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించాలని సూచించారు. 1952 లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఒక చిన్న గదిలో ప్రారంభం అయిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు నడుస్తున్నాయని వివరించారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి సేవలు అందిస్తోందని మోహన్ జీ అన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించినప్పటికీ దేశభక్తి, విలువలతో కూడిన విద్యకు పెద్ద పీట వేయటం జరుగుతోందని స్పష్టం చేశారు. విదేశాలకు విహార యాత్రకు వెళ్లే ముందు, అయోధ్య వంటి పుణ్య స్థలాల్ని సందర్శిస్తే దేశభక్తి మరింత పెరుగుతుందని అన్నారు. స్వయంసేవక్ లు చివరి శ్వాస దాకా సమాజం కోసo మాత్రమే పనిచేస్తారని మోహన్ జీ అన్నారు. మనమంతా రాముని బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించుకోవాలని, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సౌకర్యాలను సమాజహితం కోసం వాడుకోవాలని అన్నారు. ఇటీవల కాలంలో సంఘ్ మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సుధీర్, క్షేత్ర సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, ప్రాంత ఉపాధ్యక్షులు పసర్తి మల్లయ్య, కార్యదర్శి ముక్కాల సీతారాములు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, పాఠశాల అధ్యక్షులు తేలుకుంట్ల రమేష్ గుప్తా, కార్యదర్శి విష్ణు వర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానకేంద్రం ఏర్పాటుకి భూమి, వస్తు రూపంలో తోడ్పాటు అందించిన దాతలను ఆత్మీయంగా సత్కరించారు. పిల్లల సాంస్క్రతిక కార్యక్రమాలు అలరించాయి.