ప్రభుత్వం ఆరెకటికల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: జి. అశోక్ కుమార్
హైదరాబాద్: జనవరి 27(భారత్ కి బాత్)
తెలంగాణాలో జనాభా ప్రతిపాదికన ఆరెకటిక కులానికి రూ.500 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆరెకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి. అశోక్ కుమార్ అన్నారు. కోఠి హనుమాన్ టెక్ డి లోని బీసీ సాధికారత భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా పది లక్షలకు పైమాటే ఉన్నారన్నారు. తెలంగాణ కోసం మా ఆరెకటిక బిడ్డ సునీల్ కుమార్ ఆత్మబలిదానమిచ్చాడన్నారు. మా మటన్ వృత్తిపై, తొమ్మిది మేకల మండీలపై ప్రతియేటా ప్రభుత్వానికి కోట్లాది రూ.ల ఆదాయం వస్తుందని, యాభైకి పైగా ఉన్న అంగళ్ళపై కోట్లాది ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మా కులవృత్తి ఆర్ధిక వనరులుగా ఉపయోగపడుతుందని చెప్పారు. 75 ఏళ్లలో మా కులానికి ప్రత్యేక కార్పోరేషన్ ను ఏ ప్రభుత్వం ఇవ్వలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైన్స్ టెండర్లలో 30 శాతం ప్రత్యేక రిజర్వేషన్ ను కల్పించాలని అన్నారు. ప్రభుత్వం మటన్ షాపులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా ఆరెకటిక మహిళలకు రూ.3 లక్షల బ్యాంకు రుణం, 90శాతం సబ్సిడీతో మటన్ క్యాంటిన్లు, చొక్నాబోటి కర్రీ పాయింట్లు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాకు 90శాతం సబ్సిడీతో గొర్ల పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసిన అశోక్ కుమార్ ను రాష్ట్ర కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎం. నాగ శేషు, పి. రమేష్, కే. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కే. నందీశ్వర్, డీకే రామ్, రాష్ట్ర సభ్యులు నరేందర్, కేడి దినేష్ పెద్ద ఎత్తున నాయకులు తదితరులు పాల్గొన్నారు.