Search for:
  • Home/
  • क्षेत्र/
  • జల్ పల్లి మున్సిపాలిటీలో నిధులను వెంటనే విడుదల చేయాలి: సబితా ఇంద్రారెడ్డి

జల్ పల్లి మున్సిపాలిటీలో నిధులను వెంటనే విడుదల చేయాలి: సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్)

 

మహేశ్వరం నియోజకవర్గ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 175 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మంజూరు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం నిలిపి వేయటం మంచి పద్ధతి కాదని, వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జల్ పల్లి మునిసిపాలిటీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై మంగళవారం నాడు మునిసిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జల్ పల్లి మునిసిపాలిటీ పరిధిలో 45 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, వాటిని శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించానన్నారు. ఎన్నికలకు ముందు 25 కోట్లు జల్ పల్లి మునిసిపాలిటీకి కేసీఆర్ మంజూరు చేస్తే వాటిని నిలిపివేశారని, ఈ మునిసిపాలిటీ పరిధిలో పూర్తిగా పేద వారు ఉంటారని, కనీస సౌకర్యాల కల్పన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని, ఈ ప్రాంత ప్రజలపై అభిమానం ఉంటే వెంటనే ఆ నిధులను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. మునిసిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి రిజర్వాయర్లు, వాటర్ లైన్లు వేస్తున్నట్లు వాటి పురోగతిపై సమీక్షించానన్నారు. అవసరం ఉన్న దగ్గర బోర్ల రిపేర్లు కూడా చేపట్టాలన్నారు. మునిసిపల్ పరిధిలో అధికారులు ప్రజా పాలన దరఖాస్తులపై దృష్టి పెట్టడటంతో కాలనీల్లో చెత్తా చెదారం నిండిపోయిందని, వీటి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు, కౌన్సిలర్ల సహకారంతో స్వచ్ఛ మునిసిపాలిటీగా మార్చాలన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ సాధి, వైస్ ఛైర్మన్ ఫర్హా నాజ్, కమిషనర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required