కార్పోరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మేరు సంఘం జేఏసీ ప్రతినిధులు
త్వరలో నిర్వహించబోయే అభినందన సభకు మేధావులు, యువత అందరూ తరలి రావాలి
బీసీ -డీ నుండి బిసీ -ఏ లోకి చేర్చాలని మేరు సంఘం డిమాండ్
ఎల్బీనగర్: మార్చి 25(భారత్ కి బాత్)
మేరు కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై మేరు కులస్తుల ఐక్యవేదిక (జెఏసీ) హర్షం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ లో తెలంగాణ మేరు సంఘాల ఐక్యవేదిక (జెఏసీ) కన్వీనర్ మునిగాల రాము మేరు ఆధ్వర్యంలో ఆదివారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ మేరు సంఘాల ఐక్యవేదిక (జెఏసీ) కన్వీనర్ మునిగాల రాము మేరు మాట్లాడుతూ గతంలో మేరు కులస్తుల హక్కుల కోసం జెఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు అలాగే గత ఎన్నికల ముందు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. పలు రకాల వినతుల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేరు కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మేరు కులస్తులు తమ వృత్తి అయిన దర్జీ పని చేతినిండా లేనందున ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 1000 కి పైగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ఏర్పాటుచేసి పని కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అంతేకాకుండా జిల్లాల వారీగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పించాలని కోరారు. ఏకరూప వస్తువులను దర్జీ కుటుంబాలకు ఇచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
బిసీ -డి నుంచి బిసీ -ఏ లోకి మార్చాలి:
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన మేరు కులస్తులకు రిజర్వేషన్లల్లో అన్యాయం జరుగుతుందని అన్నారు. అన్ని చేతి వృత్తిదారులు బిసీ-ఏ లో ఉన్నారని, అలాగే చేతి వృత్తిదారులైన మేరు కులస్తులను బీసీ -డీ నుండి బిసీ -ఏ లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ సమస్యలను పరిష్కరించే పార్టీలకే మా సంపూర్ణ మద్దతు ఉంటుందని జేఏసీ కన్వీనర్ మునిగాల రాము వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందన సభ:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కులస్తుల అందరి సహకారంతో, సమన్వయంతో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందన సభను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత, మేధావులు, సంఘ సేవకులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై అభినందన సభను విజయవంతం చేయాలని కోరారు. అభినందన సభ విజయవంతం కోసం కమిటీలు ఏర్పాటు చేయనున్నామని ఆసక్తి ఉన్నవారు 9133551857 నెంబర్లో సంప్రదించాలని అన్నారు. ఈ సమావేశంలో మేరు సంఘ వ్యవస్థాపకులు సంఘ వెంకట్రాజం మేరు, వ్యవస్థాపక చీఫ్ అడ్వాజర్ మునిగాల రమేష్ మేరు, జంట నగరాల ఛైర్మెన్ సింగు విష్ణు మేరు, అధికార ప్రతినిధి కొత్త నర్సింహా స్వామి మేరు, కో -కన్వీనర్లు మేడిగ సంతోష్ మేరు, నోముల శాంతి కుమార్ మేరు, మాడిశెట్టి యాదగిరి మేరు తదితరులు పాల్గొన్నారు.